ప్రముఖ టాలీవుడ్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అంటే అందరికి అభిమానమే, చిన్నవయసులోనే నటుడిగా సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటి స్టార్ హీరోల్లో ఇండస్ట్రీలో అత్యధిక కాలం వర్క్ చేసిన సీనియర్, అనుభవం ఉన్న నటుడు అంటే బాలయ్య అనే చెప్పాలి. దాదాపు నాలుగు తరాల దర్శకుల దగ్గర వర్క్ చేసిన నటుడు ఆయన.
తాజాగా తన సినిమా కెరియర్ లో ఓ మైల్ స్టోన్ చేరుకున్నారు. కథానాయకుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు బాలయ్య. దీనికి గుర్తుగా బాలయ్యకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది.లండన్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తమ గోల్డ్ ఎడిషన్‌లో బాలకృష్ణకు స్థానం కల్పించింది. ఇది ఒక అపురూమైన రికార్డ్ అనే చెప్పాలి, ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కాని అరుదైన ఘనత అందుకున్నారు బాలయ్య. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇదే తొలి అని చెబుతున్నారు అందరూ.
ఇక బాలయ్య బాబుకి ఈ స్దానం దక్కడంతో ఆయన అభిమానులు ఎంతో ఆనందాన్ని తెలియచేస్తున్నారు. దేశంలో ఉన్న బాలయ్య అభిమానులతో పాటు విదేశాల్లో ఉన్న బాలయ్య అభిమానులు కూడా ఆయనకు అభినందనలు తెలియచేస్తున్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఆయన్ని అభినందించారు. ప్రియమైన బాలయ్యకు అభినందనలు. కథానాయకుడిగా 50 ఏళ్ల ఆయన ప్రస్థానం భారత సినీ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు ఆయన అసాధారణ ప్రయాణానికి నిదర్శనం అంటూ ఆయన బావ, ఏపీ సీఎం చంద్రబాబు బాలయ్యకు ఈ అరుదైన గుర్తింపు రావడం పై తన సంతోషాన్ని అభినందనల రూపంలో తెలియచేశారు.
ప్రియమైన బాల మావయ్యకు శుభాకాంక్షలు. ఆయన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించడం మా కుటుంబానికే కాక, ప్రతి తెలుగు సినీ అభిమానికి గర్వకారణం. సినిమా పట్ల ఆయనకున్న అభిరుచి, క్రమశిక్షణ మా అందరికీ స్ఫూర్తినిస్తాయి అంటూ నారా లోకేష్ కూడా ఆయన మామయ్యకు విషెస్ తెలియచేశారు, ఇక సోషల్ మీడియా వేదికగా బాలయ్య ఫ్యాన్స్ అభినందనలు తెలియచేస్తున్నారు.
ఇక ఆయనను కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ తో సత్కరించిన విషయం తెలిసిందే