సంక్రాంతి పండుగ కోసం స్వస్థలాలకు వెళ్లే వారికి ఉచిత టోల్ సదుపాయం కల్పించాలనే అంశంపై Telanagana రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. పండుగ సీజన్‌లో హైదరాబాద్ నుంచి జిల్లాలకు భారీ ఎత్తున వాహనాలు రాకపోకలు సాగుతాయి. దీంతో టోల్ ప్లాజాల వద్ద భారీ క్యూ లైన్లు, ట్రాఫిక్ జాములు ఏర్పడటం సహజం. ఈ సమస్యల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో టోల్ ఫీజులను తాత్కాలికంగా రద్దు చేసే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిసింది.
టోల్ రద్దు చేస్తే ప్రజలు సమయానికి తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా కార్లు, జీపులు, వాన్‌ల వంటి లైట్ వాహనాలకు మాత్రమే ఈ సదుపాయం వర్తించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర అనుమతి లభిస్తే ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం, విజయవాడ వంటి ప్రధాన మార్గాల్లో ప్రయాణించే వారికి ఈ స్కీమ్ వర్తించనున్నది.
పండుగ రోజుల్లో ప్రమాదాలు తగ్గించడం, అనవసర ఇంధన వృథాను నియంత్రించడం కూడా ఈ నిర్ణయం వెనక మరో ఉద్దేశంగా చెబుతున్నారు. ఇదే అమల్లోకి వస్తే లక్షలాది ప్రయాణికులకు ఉపశమనం లభించనున్నట్లు భావిస్తున్నారు.