రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు అదనపు ధరలు వసూలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
నేటి నుంచి ఈ నెల 11 వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.105, మల్టీప్లెక్స్‌లలో రూ.132 అదనంగా వసూలు చేయనున్నారు. అలాగే ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.62, మల్టీప్లెక్స్‌లలో రూ.89 అదనంగా టికెట్ ధర పెంచుకునే వెసులుబాటు కల్పించారు. మొత్తం మీద సుమారు 20 శాతం వరకు ధరల పెంపుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఈ నిర్ణయంతో తొలి వారంలోనే భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రభాస్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ ధరల పెంపు సమంజసమేనని నిర్మాతలు భావిస్తున్నారు. మరోవైపు, టికెట్ ధరల పెంపుపై అభిమానులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. సినిమా కంటెంట్ బాగుంటే ధరలు పెద్దగా ప్రభావం చూపవని అభిమానులు అంటుండగా, సాధారణ ప్రేక్షకులకు భారం కాకూడదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
మొత్తానికి ‘రాజాసాబ్’ విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద హీట్ పెరుగుతుండటంతో, సినిమా ఏ స్థాయి కలెక్షన్లు సాధిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.