రిలయన్స్ జియో త్వరలో ఐపీఓకు రానున్న విషయం తెలిసిందే. ఈ ఐపీఓ ద్వారా సుమారు రూ.40 వేల కోట్ల వరకు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది నిజమైతే, భారత క్యాపిటల్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా రిలయన్స్ జియో కొత్త రికార్డ్ నెలకొల్పనుంది.
ప్రస్తుతం ఈ రికార్డ్ 2024లో రూ.27,870 కోట్లతో ఐపీఓకు వచ్చిన హ్యుందాయ్ పేరిట ఉంది. ఆ తర్వాత స్థానాల్లో ఎల్ఐసీ (రూ.21,008 కోట్లు), పేటీఎం (రూ.18,300 కోట్లు), జీఐసీ (రూ.11,176 కోట్లు) ఉన్నాయి. జియో ఐపీఓ వీటన్నింటినీ దాటితే మార్కెట్ ట్రెండ్స్‌లో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది.
డిజిటల్ సేవలు, 5G నెట్‌వర్క్ విస్తరణ, డేటా సెంటర్లు, ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్‌లో జియో దూసుకెళ్తుండటంతో పెట్టుబడిదారుల ఆసక్తి భారీగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్లు, సంస్థాగత పెట్టుబడిదారులు ఈ ఐపీఓపై కన్నేశారు.
జియో ఐపీఓ విజయవంతమైతే, భారత టెలికాం రంగంతో పాటు మొత్తం స్టాక్ మార్కెట్‌కు ఇది గేమ్‌చేంజర్‌గా మారుతుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.