రోడ్డు ప్రమాద బాధితులకు అదనపు ఖర్చు లేకుండా చికిత్స అందించేలా కేంద్ర ప్రభుత్వం ‘గోల్డెన్ అవర్’ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విధానం ద్వారా ప్రమాదానికి గురైన బాధితులకు గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు ఉచిత వైద్యం అందించనున్నారు.
ఉస్మానియా, గాంధీ, నిమ్స్ వంటి ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు, అపోలో వంటి ఎంపిక చేసిన ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను దగ్గరలోని ఆసుపత్రికి తరలిస్తే, చికిత్స ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది.
అత్యవసర పరిస్థితుల్లో 14555 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేస్తే వెంటనే స్పందించేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ సేవలు హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయని, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశముందని వెల్లడించారు.
ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న వారికి ఇది ఎంతో ఉపయోగకరమైన నిర్ణయంగా వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.