వేసవికాలంలో బీర్లకు డిమాండ్ భారీగా పెరుగుతుండటంతో వాటి ఉత్పత్తిని మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వేసవిలో రోజుకు సగటున 2.30 లక్షల కేసుల బీర్లు అమ్ముడవగా, ఈసారి అది 2.50 లక్షల కేసులకు కూడా చేరుకునే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సరఫరాలో ఎలాంటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్ని బ్రూవరీలకు ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించింది. ఉత్పత్తి, నిల్వలు, సరఫరా వ్యవస్థను పక్కాగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉండగా ఎక్సైజ్ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, కమిషనర్ హరి కిరణ్ బ్రూవరీలను ప్రత్యక్షంగా సందర్శించి బీర్‌తో పాటు ఇతర మద్యం ఉత్పత్తి ప్రక్రియలను పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు పాటించడంతో పాటు అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా కఠినంగా వ్యవహరించాలని అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. వేసవిలో వినియోగం పెరిగే నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టనున్నట్లు కూడా తెలుస్తోంది.