బంగారం కోసం వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లా హాలియాలో తీవ్ర కలకలం రేపింది. హాలియా పట్టణానికి చెందిన సుంకిరెడ్డి అనసూయమ్మ (65) అనే వృద్ధురాలు దేవరకొండ రోడ్డులో ఉన్న ధనలక్ష్మీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమాని చిన్నపాక రాములుకు కొంత డబ్బు అప్పుగా ఇచ్చింది. ఆ డబ్బులు అడగడానికి ఈ నెల 24న ఉదయం సుమారు 8 గంటల సమయంలో ఆమె ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌కు వెళ్లింది.
అక్కడ రాములు, అతని భార్య ధనలక్ష్మి, పెద్ద కుమారుడు గౌరీ కలిసి అనసూయమ్మపై కత్తిపీటతో దాడి చేశారు. తలపై తీవ్రంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే కూలిపోయింది. అనంతరం గొంతు కోసి ఆమెను హత్య చేశారు. హత్య తర్వాత ఆమె ధరించిన బంగారు గొలుసు, చెవి దుద్దులను తీసుకుని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వెనుక భాగంలో గోతిలో మృతదేహాన్ని పూడ్చి పెట్టారు.
అనసూయమ్మ కనిపించకపోవడంతో ఆమె అక్క కూతురు సుశీల స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా సోమవారం ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో తనిఖీ చేయగా, అక్కడ పాతిపెట్టిన మృతదేహం వెలుగులోకి వచ్చింది. మృతదేహం తీవ్రంగా కుళ్లిపోయిన స్థితిలో ఉంది.
అనుముల తహసీల్దార్ రఘు సమక్షంలో డాక్టర్ల బృందం సంఘటనా స్థలంలోనే పంచనామా నిర్వహించింది. బంగారం కోసమే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమాని తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ముగ్గురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.