.
బిగ్ బాస్ కన్నడ సీజన్ 11 షూటింగ్ ప్రదేశం చుట్టూ పర్యావరణ కాలుష్యం పెరుగుతోందని గుర్తించిన కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (KSPCB) తాజాగా షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది. బిగ్ బాస్ సెట్లో వాడుతున్న నీటిని సరైన విధంగా శుద్ధి చేసి విడుదల చేయడం లేదని, అలాగే ప్లాస్టిక్ కప్పులు, ప్లాస్టిక్ పేపర్లు వంటి వ్యర్థాలను సక్రమంగా నిర్వహించడం లేదని పేర్కొంటూ బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీకి (BESCOM) ఆ సెట్కు పవర్ కట్ చేయాలని నోటీస్ జారీ చేసింది.
ఈ సీజన్ షూటింగ్ బెంగళూరుకు సమీపంలోని బిడాడి ప్రాంతంలోని జాలి హుడ్ స్టూడియోస్‌లో జరుగుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 11కి యాంకర్‌గా సుదీప్ వ్యవహరిస్తున్నారు. షూటింగ్ సెట్లో 625 KVA మరియు 500 KVA సామర్థ్యం గల రెండు భారీ జనరేటర్లు ఇన్స్టాల్ చేశారు. ఈ సెటు ఇండస్ట్రియల్ జోన్‌లో ఉండటం వల్ల వ్యర్థ జలాల విడుదల స్థానిక పరిసరాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నివేదికలు చెబుతున్నాయి.
ఈ కారణంగా, కర్ణాటక కాలుష్య నియంత్రణ మండలి వెంటనే చర్యలు తీసుకుని, బిగ్ బాస్ సెట్కు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ఆదేశించింది. ఈ నిర్ణయం తర్వాత కార్యక్రమం కొనసాగుతుందా లేదా అన్నదానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. బిగ్ బాస్ టీమ్ ఇప్పుడు పర్యావరణ నిబంధనలను పాటించేలా కొత్త చర్యలు చేపడుతుందో లేదో చూడాలి.