దేశ ప్రజలు అందరూ కూడా ఎదురుచూశారు ఉపరాష్ట్రపతి ఎవరు అవుతారా అని, ఫైనల్ గా
భారతీయ జనతా పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై కసరత్తును పూర్తి చేసి ఆ పేరుని తెలియచేసింది.
మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ పేరును ఎన్‌డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ పలువురు అగ్రనాయకులు ఆయన పేరుని ఫైనల్ చేశారు. ఇక ఆయన ఎన్నిక లాంఛనప్రాయమే అని చెప్పాలి.. ఆయన ఎంపిక వెనుక బీజేపీ ఎన్నో ఆలోచనలు చేసి, ఆయన పేరుని ప్రకటించింది అని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
కాబోయే ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ గారి బాల్యం, రాజకీయ ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్, సీపీ రాధాకృష్ణన్‌గా ఆయన్ని అందరూ పిలుస్తారు. తమిళనాడు రాష్ట్రం తిరుప్పూర్‌లో 1957 అక్టోబర్ 20న జన్మించారు. చిన్నతనం నుంచి రాజకీయాలు అంటే ఆయనకు ఆసక్తి. ఆయన 16వ ఏటనే ఆర్ఎస్ ఎస్ లో చేరారు. ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవక్‌గా సర్వీస్ మొదలు పెట్టారు. పట్టుదలతో కృషితో పనిచేయడంతో అంచెలంచెలుగా తక్కువ సమయంలో ఎదిగారు .1974లో భారతీయ జనసంఘ్‌లో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమితులయ్యారు.
ఆ తర్వాత బీజేపీ అధిష్టానం ఆయనకు ఎంపీగా అవకాశం ఇచ్చింది.1998, 1999లో కోయంబత్తూరు నుంచి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఆయన విజయం సాధించారు. అంతేకాదు పార్లమెంటరీ బోర్డుల్లో పలు పదవులు నిర్వహించారు .టెక్స్‌టైల్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా, పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్, ఫైనాన్స్ కమిటీల సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.
ఇక తమిళనాడులో కరుణానిధి జయలలిత ప్రభంజనంలో బీజేపీ తరపున తన గళం విపించేవారు.
2004-2007 మధ్య తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు.
19,000 కి.మీ.ల రథయాత్రను 93 రోజులపాటు నిర్వహించారు.
2016లో కాయిర్ బోర్డ్ చైర్మన్ గా కూడా సేవలు అందించారు.
2020-2022లో కేరళ బీజేపీ ఇన్ఛార్జ్‌గా ఆయన్ని అధిష్టానం నియమించింది
2023లో జార్ఖండ్ గవర్నర్‌గా ఆయన్ని నియమించారు
2024లో మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
చాలా సౌమ్యుడిగా, వివాదరహితుడిగా ఆయనకు మంచి పేరు ఉంది, సమస్యలపై ప్రత్యేక దృష్టిపెడతారు అని అంటారు.
ఇక గౌండర్ సామాజిక వర్గానికి చెందిన వారు రాధాకృష్ణన్ . తమిళనాడులో 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి, బీజేపీ అధిష్టానం రాజకీయంగా ఇవన్నీ కూడా ఆలోచించి, ఆ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు కూడా ఈ నిర్ణయం తీసుకుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సెప్టెంబర్ 9న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాధాకృష్ణన్ ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తారు. ఆగస్టు 21 నామినేషన్ గడువు.
ఇక మెజార్టీ సభ్యులు ఎన్డీయేకి ఉండటంతో ఆయన గెలుపు చాలా సులభం అనే చెప్పాలి.