ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాడ తీవ్ర సైబర్ వేధింపుల బారిన పడ్డారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఫోటోలను మార్ఫ్ చేసి, అసభ్యంగా తయారు చేసి పంపిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. అంతేకాదు, ఆమెకు మాత్రమే కాదు… ఆమె పిల్లలపై బెదిరింపు సందేశాలు పంపినట్లు చిన్మయి వెల్లడించారు.
ఈ ఘటనపై ఆమె తీవ్రంగా స్పందించారు. ఇలాంటి దిగజారిన చర్యలను తాను భరించలేనని, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సైబర్ నేరాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయని, ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని ఇలా వేధించడం చాలా ప్రమాదకరమని చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు జరిగిన అనుభవాన్ని బహిర్గతం చేయడం ద్వారా ఇతర మహిళలకు ధైర్యం చెప్పాలనేదే తన ఉద్దేశమని చెప్పారు.
“భయపడకండి… మౌనంగా ఉండకండి… చట్టాన్ని ఆశ్రయించండి” అని ఆమె స్పష్టంగా సందేశం ఇచ్చారు.
ఈ ఘటన మరోసారి సోషల్ మీడియాలో భద్రత, సైబర్ నేరాలపై కఠిన చర్యలు ఎంత అవసరమో గుర్తు చేస్తోంది.