చిరంజీవి–అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రానికి టికెట్ రేట్లను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ సినిమా ఈ నెల 12న థియేటర్లలో విడుదల కానుండగా, ఒక రోజు ముందుగా అంటే 11న ప్రీమియర్ షోలకు కూడా అనుమతి మంజూరు చేసింది. ప్రీమియర్ షోల టికెట్ ధరను రూ.600గా నిర్ణయించినట్లు సమాచారం.
అలాగే సినిమా విడుదలైన తర్వాత వారంపాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అంగీకరించింది. సింగిల్ స్క్రీన్లలో GSTతో కలిపి టికెట్ ధరపై రూ.50 వరకు, మల్టీప్లెక్సుల్లో రూ.100 వరకు అదనంగా వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించింది.
ఈ నిర్ణయంతో తొలి వారం కలెక్షన్లు భారీగా ఉండే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చిరంజీవి సినిమా కావడంతో ఫ్యాన్స్‌లో ఇప్పటికే హైప్ నెలకొనగా, టికెట్ ధరల పెంపు మరింత చర్చకు దారి తీసింది. ఒకవైపు నిర్మాతలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా, మరోవైపు సాధారణ ప్రేక్షకులపై భారం పడకూడదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి సినిమా విడుదలకు ముందే బాక్సాఫీస్ వాతావరణం వేడెక్కింది.