గత కొన్ని రోజులుగా గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టబోతోందనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
మంత్రి ఖర్గే మాట్లాడుతూ, “గూగుల్ ఏపీకి వెళ్లడానికి చాలా కారణాలు ఉన్నాయి. అక్కడి ప్రభుత్వం ఆ సంస్థకు రూ.22,000 కోట్ల విలువైన ప్రోత్సాహకాలు అందించింది. అంతేకాకుండా స్టేట్ GSTలో 100% రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం జరిగింది. భూమి కూడా 25% డిస్కౌంట్‌తో కేటాయించారు. నీటి టారిఫ్‌లో 25% తగ్గింపు ఇచ్చారు. అంతే కాదు, ట్రాన్స్‌మిషన్ ఫెసిలిటీలను 100% ఉచితంగా అందించనున్నారు,” అని చెప్పారు.
అయితే, ఆయన స్పష్టంగా పేర్కొన్నది ఏమిటంటే — “ఈ రాయితీలు, ప్రోత్సాహకాలు అన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. కానీ మీడియా మాత్రం గూగుల్ ఏపీకి వచ్చింది అని మాత్రమే హైలైట్ చేస్తోంది. అసలు నేపథ్యాన్ని ఎవరూ ప్రస్తావించడం లేదు. ఇలాంటి ప్రోత్సాహకాలు మేము ఇస్తే, కర్ణాటక ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని విమర్శిస్తారు. కానీ ఇతర రాష్ట్రాలు ఇస్తే దాన్ని అభివృద్ధిగా చూపిస్తారు,” అని అన్నారు.
మరింతగా మాట్లాడుతూ, “బెంగళూరులో జనాభా పెరుగుతోందని కొందరు అంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణా నుండి వేలాది మంది ఇక్కడ ఉద్యోగాలు చేస్తే అది కూడా జనాభా పెరుగుదలకే కదా? అందువల్ల దీనిని అభివృద్ధి సంకేతంగా చూడాలి, సమస్యగా కాదు,” అని ఆయన పేర్కొన్నారు.
మంత్రి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. కొందరు ఆయన అభిప్రాయాలను సమర్థించగా, మరికొందరు ప్రతిపక్ష వైఖరిని ఎత్తిచూపుతున్నారు. గూగుల్ పెట్టుబడులు ఏ రాష్ట్రానికైనా ఆర్థికాభివృద్ధి, ఉపాధి అవకాశాలు తెస్తాయన్నది వాస్తవమే. కానీ ఇలాంటి భారీ పెట్టుబడుల వెనుక ప్రభుత్వాలు ఇచ్చే ప్రోత్సాహకాలు కూడా ప్రజలకు పారదర్శకంగా తెలియజేయడం అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.