నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. దివంగత నందమూరి తారక రామారావుగారి పెద్ద కోడలు పద్మజ కన్నుమూశారు. జయకృష్ణ సతీమణి నందమూరి పద్మజ కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు.
అయితే పద్మజ ఈ రోజు తెల్లవారుజామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు, చివరకు కుటుంబ సభ్యులు వెంటనే ఆమెని హైదరాబాద్ లో ప్రముఖ హాస్పటల్ కు తీసుకువచ్చారు, అయితే ట్రీట్మెంట్ పొందుతూ ఆమె కన్నుమూశారు. ఆమె వయసు 73 సంవత్సరాలు.
ఇక పద్మజ దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు స్వయాన సోదరి. ఆమె మరణ వార్తతో కుటుంబ సభ్యులు అందరూ కన్నీటిపర్యంతం అయ్యారు. ఇక నందమూరి అభిమానులు కూడా సంతాపం తెలియచేస్తున్నారు. సినిమా ప్రముఖులు రాజకీయ నేతలు వారి కుటుంబ సభ్యులని పరామర్శిస్తున్నారు.
ఇక సీఎం చంద్రబాబు కూడా ఆమె మరణం పై స్పందించారు. బావమరిది నందమూరి జయకృష్ణ సతీమణి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోదరి పద్మజ మరణించారని తెలిసి చాలా బాధ కలిగింది. ఎంతో దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఈ ఘటన మా కుటుంబంలో విషాదం నింపింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి అని కోరుకుంటున్నా అన్నారు సీఎం చంద్రబాబు.
సీఎం చంద్రబాబు అమరావతి నుంచి హైదరాబాద్ వెళ్లనున్నారు.. ఇక మంత్రి నారా లోకేష్ కూడా తన అత్త కన్నుమూశారు అనే వార్త విని తీవ్ర ఆవేదనకు లోనయ్యారు, మా కుటుంబానికి అన్నీ వేళలా అండగా నిలిచిన పద్మజ అత్త మరణం మా కుటుంబానికి తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
నందమూరి జయకృష్ణ, పద్మజల కుమారుడు నందమూరి చైతన్య కృష్ణ. ఆయన ధమ్ అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయం అయ్యారు. తర్వాత బ్రీత్ సినిమాలో నటించారు.