రాజధాని అమరావతి ప్రాంతంలోని నీరుకొండలో సమారు 3500 టన్నుల కంచుతో దివంగత నటుడు, రాజకీయ నేత ఎన్టీఆర్ భారీ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే డిజైన్‌ను క్యాబినెట్ సబ్ కమిటీ పరిశీలించి ఆమోదం తెలిపినట్లు సమాచారం. విగ్రహంతో పాటు స్మృతివనం, సందర్శకుల కోసం ప్రత్యేక వసతులు కల్పించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
విగ్రహ నిర్మాణానికి అవసరమైన కంచు, ఇతర ముడి పదార్థాల సరఫరా బాధ్యతలను ప్రభుత్వ రంగ సంస్థకు అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఎన్టీఆర్ రాజకీయ, సినీ ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా విగ్రహం రూపకల్పన చేయనున్నారు. విగ్రహం పూర్తయితే అమరావతి ప్రాంతానికి మరో ప్రధాన ఆకర్షణగా మారుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే, పర్యాటకాన్ని పెంపొందించడంలోనూ ఈ విగ్రహం కీలక పాత్ర పోషించనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.