తెలంగాణలోని వృద్ధులకు శుభవార్త. 60 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 37 ‘డేకేర్ సెంటర్లు’ ఏర్పాటు చేసింది. ఇవి నేడు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్‌గా ఈ కేంద్రాలను ప్రారంభించనున్నట్లు సమాచారం.
ఈ డేకేర్ సెంటర్లలో వృద్ధులకు పోషకాహారం, యోగా, మెడిటేషన్, టీ-స్నాక్స్, కౌన్సెలింగ్, ఇండోర్ గేమ్స్ వంటి సదుపాయాలు అందించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కేంద్రాలు పనిచేస్తాయి.
ఇంట్లో ఒంటరితనంతో బాధపడే వృద్ధులకు మానసిక ఉల్లాసం కలిగించడమే లక్ష్యంగా ఈ కేంద్రాలను రూపొందించారు.
వృద్ధులు పరస్పరం కలుసుకుని మాట్లాడుకునే అవకాశం కల్పించడం, ఆరోగ్యంపై అవగాహన పెంచడం కూడా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.
ప్రస్తుతం అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ డేకేర్ సెంటర్లు ప్రారంభించగా, భవిష్యత్తులో మండల స్థాయిలోనూ విస్తరించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ‘బాల భరోసా’ తరహాలో ‘బాల భరోసా – సీనియర్స్’గా ఈ పథకం నిలవాలని ప్రభుత్వం భావిస్తోంది.
వృద్ధుల సంక్షేమానికి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సామాజిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.