రానున్న మున్సిపల్ ఎన్నికలను ఈసారి కూడా బ్యాలెట్ పేపర్‌తోనే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాలెట్ బాక్సులు, సీల్స్, గార్డింగ్ ఏర్పాట్లు తక్షణం పూర్తి చేయాలని మున్సిపాలిటీ అధికారులకు ఇప్పటికే సూచనలు జారీ చేసినట్లు సమాచారం.
ఇంతకుముందు 2014లో EVMలతో ఎన్నికలు నిర్వహించగా, 2020లో కరోనా పరిస్థితుల కారణంగా బ్యాలెట్ పద్ధతినే అనుసరించారు. ఈసారి కూడా EVMల వినియోగంపై చర్చ జరిగినప్పటికీ, సాంకేతిక సమస్యలు, కేసులు, అభ్యంతరాలు తలెత్తే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం బ్యాలెట్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
ఎన్నికల షెడ్యూల్ విషయానికి వస్తే, మరో ఒక వారం నుంచి 10 రోజుల్లో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఓటర్ల జాబితా తుదిరూపు ఈ నెల 10న వెల్లడి కానుంది. కొత్త ఓటర్ల నమోదు, సవరణలు, ట్రాన్స్ఫర్లు వంటి ప్రక్రియలు దాదాపు పూర్తయినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరగడంతో పోలింగ్ సిబ్బంది, భద్రతా బలగాలకు అదనపు శిక్షణ అవసరం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. అదే సమయంలో, ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొంత ఎక్కువ సమయం పట్టే అవకాశం కూడా ఉంది.