తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌ను ఇకపై షోరూమ్‌ల్లోనే పూర్తి చేసుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విధానం ఈ నెల 15 నుంచి అమల్లోకి రానుంది. దీంతో ఇకపై కొత్త కారు లేదా బైక్ కొనుగోలు చేసిన వారు RTA కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.
డీలర్ ఆటోమేషన్ విధానం ద్వారా వాహన కొనుగోలుదారుల వివరాలు, అవసరమైన డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియను షోరూమ్‌లోనే పూర్తిచేయనున్నారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే వాహన నంబర్ కేటాయింపు జరుగుతుంది. అనంతరం RC కార్డును స్పీడ్ పోస్టు ద్వారా నేరుగా యజమాని చిరునామాకు పంపిస్తారు.
ఈ కొత్త విధానం వల్ల సమయం ఆదా అవడమే కాకుండా, దళారుల జోక్యం తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వాహన కొనుగోలు ప్రక్రియ మరింత పారదర్శకంగా మారనుందని, ప్రజలకు సౌకర్యంగా ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
అయితే ఈ సౌకర్యం ప్రస్తుతం నాన్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు కూడా ఈ విధానాన్ని విస్తరించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు.