బైక్‌పై వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలనే నియమాన్ని విశాఖ పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు చాలా మంది “హెల్మెట్ డ్రైవర్‌కే అవసరం” అని భావిస్తుండగా, ఇప్పుడు పిలియన్ రైడర్ హెల్మెట్ లేకపోయినా జరిమానా వేస్తున్నారు. వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకోకపోతే ₹1,035 జరిమానా విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
జనవరి 1 నుంచి ఈ-చలాన్లు జారీ చేయడం ప్రారంభించగా, మొదటి రెండు రోజుల్లోనే వేలాది మందికి చలాన్లు వెళ్లినట్లు సమాచారం. హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల జరిగే ప్రమాదాల్లో తీవ్రమైన గాయాలు, మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు గుర్తుచేస్తున్నారు.
ప్రస్తుతం ప్రత్యేక డ్రైవ్ చేపట్టి, ముఖ్యంగా జంక్షన్లు, నేషనల్ హైవేలు, బీచ్ రోడ్ల వద్ద కఠినంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. “నియమాల కోసం కాదు… ప్రాణాల కోసం హెల్మెట్” పెట్టుకోవాలని పోలీసులు సూచించారు.